మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి తండ్రిపై దాడి ఘటన కలకలంరేపింది. శుక్రవారం రాత్రి పులివెందుల సమీపంలోని నామాలగుండు దగ్గర శివరాత్రి జాగరణ కోసం వెళ్లిన దస్తగిరి తండ్రి షేక్ హాజీవలిని కొందరు అడ్డుకున్నారు. సీఎం జగన్‌పై పోటీ చేసేంత ధైర్యం దస్తగిరికి ఉందా అంటూ దాడికి పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. తీవ్రగాయాలైన హాజీవలిని పులివెందుల ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పులివెందుల పోలీసులకు దస్తగిరి తండ్రి ఫిర్యాదు చేశాడు.
ఈ దాడి ఘటనపై సీనియర్ లాయర్, జై భీమ్ భారత్ పార్టీ చీఫ్ జడ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసే మొనగాడా అంటూ దస్తగిరి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపటానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రయత్నించారని మండిపడ్డారు. దస్తగిరి పోటీలో నుంచి విరమించుకోకపోతే కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామంటూ హెచ్చరించారన్నారు.
దస్తగిరి గత వారం జై భీమ్ రావ్ భారత్ పార్టీలో దస్తగిరి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. దస్తగిరి అభ్యర్థిత్వంపై ఏమీ చేయలేకదస్తగిరి కుటుంబ సభ్యులపై దాడి చేయటం దారుణమన్నారు. వెంటనే దస్తగిరి కుటుంబ సభ్యులందరికీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దాడి ఘటనపై 12న సీబీఐ కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయవలసిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.