ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ, బీజేపీ పొత్తుతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. మరోవైపు వైనాట్ 175 అంటున్న వైసీపీ అధినేత జగన్ సైతం ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఎంతమంది వచ్చినా, ఎన్ని కూటములు వచ్చినా సింగిల్ గానే వస్తామంటున్న వైఎస్ జగన్.. ఈసారి 175 టార్గెట్ తప్పకూడదనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అందుకే నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రచారపర్వానికి జగన్ సిద్ధమయ్యారు. వచ్చే 20 రోజుల్లో వైఎస్ జగన్ రాష్ట్రమంతటినీ చుట్టేసేలా కార్యాచరణ రూపొందించే పనిలో వైసీపీ అధిష్టానం పడింది. ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలతో జగన్ శనివారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ప్రచార సన్నద్ధతపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు.
ఈ క్రమంలోనే మార్చి 16 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఉత్తరాంధ్ర నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్న వైఎస్ జగన్..26 జిల్లాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ కనీసం 3 నియోజకవర్గాలను కవర్ చేసేలా.. 2, 3 సభలు నిర్వహించాలని జగన్ సూచించినట్లు తెలిసింది. ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల కూటమిపై స్పష్టత రావటంతో కూటమి టార్గెట్‌గా జగన్ ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ఆఖర్లో రోజుకు నాలుగైదు నియోజకవర్గాలను చుట్టేసేలా జగన్ ప్రచారం షెడ్యూల్ ఉండనున్నట్లు సమాచారం.
మరోవైపు ఆఖరి సిద్ధం సభ ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరగనుంది. ఆఖరి సభ కావటం, అందులోనూ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో వైసీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైఎస్ జగన్ మ్యానిఫెస్టో ప్రకటిస్తారనే వార్తల నేపథ్యంలో ఇప్పటివరకూ జరిగిన మూడు సిద్ధం సభలకంటే ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. ఈ సభకు 43 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు హాజరుకానున్నారు.
సుమారుగా15లక్షల మందికిపైగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు వస్తారని సమాచారం. ఎన్నిలక్షలమంది కార్యకర్తలు బహిరంగ సభకు వచ్చినా ఇబ్బందులు లేకుండా వైసీపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం ప్రసంగం అందరికి కనిపించేలా భారీ స్క్రీన్‌లు ఏర్పాట్లు చేశారు. ఆఖరి సిద్ధం సభ పూర్తైన వెంటనే మార్చి 16 నుంచి ఉత్తరాంధ్ర నుంచి సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారం మొదలెట్టనున్నారు.