ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యురాలు కావాలనుకున్న తన చిన్ననాటి కలను సాకారం చేసుకున్న యువతి.. అలాగే పీజీ చేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇంతలోనే ఊహించని విధంగా మృత్యువు వెంటాడింది. స్నేహితులతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన తెలుగు వైద్యురాలు ప్రాణాలు కోల్పోయింది.
కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈనెల 2వ తేదీ సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ఆమె చనిపోగా.. తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. శనివారం అంత్యక్రియల నిమిత్తం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్య (మూల్పూరు రమేష్)ల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.