ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లకు తాయిలాల పంపిణీకి నాయకులు శ్రీకారం చుట్టారు. తాజాగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వాలంటీర్లకు కానుకల కోసం లక్షలు ఖర్చుచేసినట్టు సమాచారం. మొత్తం 22 డివిజన్లలో ఉన్న వెయ్యి మందికి పైగా వాలంటీర్లకు స్మార్ట్‌వాచ్‌లను అధికార వైఎస్‌ఆర్సీపీ ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. భవానీపురంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గత రెండు మూడు రోజులుగా సమావేశాలు ఏర్పాటుచేసి ఒక్కొక్కటి రూ.2వేల విలువచేసే స్మార్ట్‌వాచ్‌లు అందజేసినట్టు సమాచారం. రోజూ ఐయిదు డివిజన్ల వాలంటీర్లను పిలిపించి వీటిని అందజేసినట్టు భోగట్టా.
వీటన్నింటి విలువ రూ.20లక్షలకు పైగా ఉంటుందని అంచనా. ఆయా వార్డు సచివాలయాల పరిధిలోని సమస్యలపై చర్చించాలని, అందరూ తప్పనిసరిగా హాజరు కావాలంటూ వాలంటీర్లకు మెసేజ్‌లు అందాయి. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని కార్పొరేటర్ల పేరుతో వాలంటీర్ల ఫోన్లకు సందేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఇన్‌ఛార్జి షేక్ ఆసీఫ్, కార్పొరేటర్ల పర్యవేక్షణలో ఈ సమావేశాలు జరిగినట్టు సమాచారం. షేక్ ఆసీఫ్‌ను గెలిపించేందుకు వాలంటీర్లు కృషి చేయాలని వాలంటీర్లకు సూచించినట్లు తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత వాలంటీర్లందరికీ స్మార్ట్ వాచ్‌లను అందజేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
కాగా, ఇటీవల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫొటోలు ముద్రించిన బ్యాగుల్లో చీరలు పెట్టి వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంపీ, ఎమ్మెల్యే మీకు చీరలు పంపించారని, వారిని గుర్తించుకుని ఓటు వేయాలని ప్రచారం చేయిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనం, పారితోషికాలు తీసుకుంటున్న వాలంటీర్లు ఒక రాజకీయ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించడం చట్ట విరుద్ధమని మండిపడుతున్నాయి. తమ విధుల్లో భాగంగా ఓటర్లను ప్రభావితం చేయగలిగే అవకాశమున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, రిసోర్స్‌పర్సన్‌లు, యానిమేటర్లకు సైతం కానుకలు పంపిణీ చేస్తున్నారు.