ముద్రగడ పద్మనాభం.. ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. కాపు సామాజికవర్గంలో పట్టున్న నేత. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన నాయకుడు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ఏ వైపున ఉంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కుటుంబంతో ముద్రగడకు ఎందుకు చెడిందనే దానిపైనా భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వారం రోజుల కిందటి వరకూ ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వెళ్తారనే వార్తలు వచ్చాయి. కొంతమంది టీడీపీ, జనసేన నేతలు ఆయన్ని కలవడంతో ఆ వార్తలకు మరింత ప్రచారం చేకూరింది. ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారనే వార్తలు వచ్చాయి. ఒకట్రెండు తేదీలు కూడా వినిపించాయి.
కానీ ఏమైందో తెలీదు కానీ.. ముద్రగడ ఇంటికి పవన్ కళ్యాణ్ రాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ రెండుసార్లు తనను కలుస్తానని చెప్పి హ్యాండిచ్చారని ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనాని తీరుపై మండిపడుతూ ఓ లేఖను కూడా సంధించారు. ఆ తర్వాత వైసీపీ నేతలు ముద్రగడను కలవడంతో ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం నడుస్తోంది. మార్చి 12న వైసీపీలోకి చేరవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ తీరుమీద సోషల్ మీడియా వేదికగా జనసైనికులు, నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ముద్రగడను పవన్ కళ్యాణ్ అవమానించారని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. మరికొందరి వాదన మరోలా ఉంది. ముద్రగడకు మెగా ఫ్యామిలీ అంటే నచ్చదని, అందుకే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు సంధిస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను విమర్శించే ముద్రగడ, వైసీపీ విధానాల మీద ఎందుకు మాట్లాడరని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో విశ్లేషణ కూడా వినిపించింది. చిరంజీవి తన ఇంటికి వస్తే 15 కూరలతో వారికి వడ్డించానని.. అదే తాను వారింటికి వెళ్తే రెండు కూరలతోనే వడ్డించారని ముద్రగడ అన్నారని ఓ విశ్లేషకులు వెల్లడించారు. అలాంటి భావాలున్న వ్యక్తి నుంచి ఇంకేం ఆశిస్తామంటూ అభిప్రాయపడ్డారు. మరోవైపు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి నేతలు వైసీపీ కోవర్టులు అని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అందుకే టీడీపీ, జనసేన కలవకుండా ప్రయత్నాలు చేశారని, చివరకు అనుకున్న పని జరగకపోవటంతో వైసీపీలో చేరుతున్నారని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వీరిపై విరుచుకుపడుతున్నారు.