బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ కుంభమేళాను తలపించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైయస్ఆర్‌సీపీ సునామీకి తాజా సభ మరో తార్కాణమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మేదరమెట్ల–రేణంగివరం మధ్య కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో నిర్వహించిన సిద్ధం సభకు ఉదయం 9.30 గంటల నుంచే కార్యకర్తలు, నేతలు, అభిమానుల ప్రవాహం మొదలైంది. మధ్యాహ్నం 2.45 గంటలకు సభా ప్రాంగణం మొత్తం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత సభకు వస్తున్న వారంతా జాతీయ రహదారిపై(అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు దిగడానికి వీలుగా పది లేన్లతో నాలుగు కి.మీ.పొడవున అభివృద్ధి చేశారు) నిలబడిపోయారు. సభకు తరలివస్తున్న లక్షలాది మంది ప్రజలు వాహనాల్లోనే ఉండిపోయారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేదరమెట్ల–రేణంగివరం మధ్య 18 కి.మీ. పొడవున ఆరు వరుసల రహదారిపై వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మేదరమెట్ల నుంచి అద్దంకి వైపు వెళ్లే నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఏడు కి.మీ. పొడవున వాహనాలు స్తంభించిపోయాయి. సీఎం వైయస్ జగన్ ప్రసంగం పూర్తయిన తర్వాత కూడా సభకు జనప్రవాహం కొనసాగడం గమనార్హం.