ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి సంతోషంగా తన అభిప్రాయాన్ని తెలియజేసిన గొల్తి గీతాంజలిపై సోషల్ మీడియాలో వికృతంగా ట్రోల్ చేసి ఆమె బలవన్మరణానికి కారకులైన ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా మృగాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని హెచ్చరించారు. గీతాంజలి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వెనుక ప్రభుత్వం చేసిన మంచిని మరెవరూ చెప్పకుండా అణచివేయాలనే పెద్ద కుట్ర ఉందని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనల వెనక నారా లోకేశ్ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. గీతాంజలి మరణించిన తర్వాత కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వీరికసలు మనసనేది ఉందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలంతా వీరి దుశ్చర్యలను గమనించాలని రానున్న ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆమె సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని గొల్తి గీతాంజలి నివాసానికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పోతుల సునీత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కన్వినర్ సజ్జల భార్గవరెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పవిత్ర పరామర్శించారు.