కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం వాయిదాపడింది. తొలుత మార్చి14వ తేదీ ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతానని ప్రకటించారు. భారీర్యాలీగా వెళ్లి తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని వెల్లడించారు. అయితే ఇప్పుడు ముద్రగడ చేరిక వాయిదా పడింది. ముుందుగా ప్రకటించిన మార్చి 14న కాకుండా .. మార్చి 15 లేదా 16 వ తేదీలలో వైసీపీలో చేరనున్నట్లు ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ మేరకు అభిమానులకు ఓ లేఖ రాశారు. అలాగే తాడేపల్లికి ర్యాలీగా వెళ్లాలనే తన నిర్ణయాన్ని కూడా మార్చుకున్నారు. కేవలం తానుు మాత్రమే తాడేపల్లికి వెళ్లి వైసీపీలో చేరనున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
అయితే ముద్రగడ తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక వేరే కారణాలు ఉన్నట్లు తెలిసింది. మార్చి 14వ తేదీ వైసీపీలో చేరతానని ప్రకటించిన ముద్రగడ.. తన కుమారుడు సైతం తనతో పాటు వైసీపీలో చేరతారని ఇటీవల వెల్లడించారు. ఇందుకోసం తాడేపల్లికి ర్యాలీగా వెళ్తానని తెలిపారు. ఆ తర్వాత తన మద్దతుదారులకు లేఖరాసిన ముద్రగడ పద్మనాభం..ర్యాలీ కోసం కార్లు, భోజన ఏర్పాట్లను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని వారికి సూచించారు. మార్చి 14వ తేదీ వైసీపీలో చేరతానని, తనకు మద్దతురావాలని అభిమానులు, మద్దతుదారులకు లేఖలో విజ్ఞప్తి చేశారు. అయితే ముద్రగడ వైసీపీలో చేరే తేదీ సమీపిస్తున్న సమయంలో.. ఊహించని విధంగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
మార్చి14న వైసీపీలో చేరడం లేదని.. మార్చి 15 లేదా 16వ తేదీల్లో వైసీపీలో చేరతానని ఆయన అభిమానులకు లేఖ రాశారు. ర్యాలీగా ఎక్కువ మంది తన వెంట వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ముద్రగడ అందులో పేర్కొన్నారు. కూర్చోవడానికి కాదు నిలబడటానికి కూడా చోటు సరిపోదని, ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బందని భద్రతా సిబ్బంది చెప్పడంతో నిర్ణయాన్ని మార్చుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. నిరుత్సాహపరచినందుకు క్షమాపణలు చెప్పిన ముద్రగడ పద్మనాభం ..తాను ఒక్కడినే తాడేపల్లి వెళ్ళి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని వెల్లడించారు.