ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మీద సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వైద్యారోగ్యశాఖలో అర్హులైన 397 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
వారం రోజుల కిందటే వైద్యారోగ్యశాఖలోని 2,146 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేస్తూ ఏపీ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2014 ఏప్రిల్ ఒకటో తేదీకంటే ముందు నుంచి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 2, 146 మంది ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ అసిస్టెంట్ సిబ్బందిని క్రమబద్దీకరిస్తూ జీవో జారీ చేశారు. తాజాగా మరో 397 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ వారికి శుభవార్త చెప్పారు. దీంతో వారం రోజుల గ్యాప్‌లోనే వైద్యారోగ్యశాఖలోని 2,543 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసినట్లు అయ్యింది. అయితే కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని సీఎం జగన్ 2019 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు వివిధ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులందరికీ సంబంధిత విభాగాలలోని వారి సహోద్యోగులతో సమానంగా స్కేల్-ఆఫ్-పే పొందుతారు.