ఎన్నికలకు వాలంటీర్లను వినియోగించడంపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు విచారణ రాగా.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల్లో వాలంటీర్లు తమకు పని చేయాలని చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు ఎందుకు వ్యవహరించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సీఈవో, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సీఎఫ్‌డీ అభ్యర్థనను వెంటనే అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.