పార్వతీపురం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించడానికి ప్రతిఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలు తెలుసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక తెలిపారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె.. ఎన్నికల సమయంలో పాటించాల్సిన విధి విధానాలను వివరించారు. నామినేషన్లు దాఖలు చేసినప్పుడు నామినేషన్ పత్రాలతో పాటు అందించాల్సిన పత్రాలు, ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి, ఎన్నికల ఖర్చు, ప్రచారం కోసం అనుమతులు, ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మిషన్లు, పోస్టల్ బ్యాలెట్, ఇంటి వద్ద ఓటింగ్, ఎన్నికల సమయంలో చేయాల్సిన పనులు, చేయరాని పనులపై అవగాహన కల్పించారు. దివ్యాంగులకు 85ఏళ్లు దాటి పోలింగ్ కేంద్రానికి రాలేని వృద్ధులకు ఇంటి వద్ద ఓటు వేసుకునే సదుపాయం కల్పిస్తారని, దానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ప్రచారానికి సంబంధించి వాహనాలు, లౌడ్ స్పీకర్లు, సమావేశాలు, ఊరేగింపులకు ముందుగా అనుమతి తీసుకోవాలన్నారు. ఎలకా్ట్రనిక్ మీడియా ప్రకటనలకు విధిగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. పోలింగ్ రోజున, పోలింగ్‌కు ముందు ప్రింట్ మీడియాలో ప్రచురించే ప్రకటనలకు అనుమతులు అవసరమన్నారు. ప్రార్థనా మందిరాల్లో ప్రచారం చేయకూడదన్నారు. ఈ అవగాహన సదస్సులో ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ ఆర్వీ సూర్యనారాయణ, డీపీఆర్వో లోచర్ల రమేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు జి.వెంకటనాయుడు, పారిశర్ల అప్పారావు, వి.శ్రీనివాసరావు, పాపారావు, పైల శ్రీనివాసరావు, పి.రవికుమార్, వై.మన్మథరావు పాల్గొన్నారు.