జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ మూడు పార్టీలకు ఎవరు ఓటు వేసినా బీజేపీకి వేసినట్టేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి బీజేపీ, పాలక, ప్రతిపక్షం చేసిన మోసాలను వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా గురువారం ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించిందని, ప్రత్యేక హోదా ఉద్యమం బుజాన వేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, గొర్రెల్లాగా ఉండొద్దని సింహాల్లా బయటకు రావాలని పిలుపిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌ను నమ్ముకుని పదేళ్లుగా గొర్రెల్లాగా ఉన్నామని, ఇక నుంచి అయినా సింహాల్లాగా గర్జించాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం మనం సింహాల్లా పోరాడి సాధించుకోవాలని.. అవసరమైతే లాక్కోవాలని షర్మిల అన్నారు. ఏపీ రాష్ట్రానికి నరేంద్రమోదీ ఏం చేశారని పవన్ కల్యాణ్.. ప్రధాని మోదీ అంటే గౌరవం అని అంటున్నారని, మోదీ డీఫాల్టర్ కాదా? ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా లేదని.. పోలవరం.. విభజన హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వైఎస్ హయంలో 54 ప్రాజెక్టులు ప్రారంభించారని.. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ప్రాజెక్టులను నీరుగార్చారని విమర్శించారు. ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని.. ఆయన వైఎస్ వారసుడా? అంటూ ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడేవాళ్లు లేరు కాబట్టే తాను ఏపీ ప్రజల కోసం వచ్చానని షర్మిల అన్నారు. రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారని, ప్రత్యేక హోదా సాధించులోలేకపొతే ఏపీకి భవిష్యత్తు లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ, పాలక, ప్రతిపక్షం మోసం చూస్తుంటే తనకే బాధగా ఉందన్నారు. ప్రత్యేక హొదా కోసం కాంగ్రెస్ పార్టీగా డిక్లరేషన్ ఇచ్చామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోనే సాధ్యమని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.