ఏపీలో సంచలనంరేపిన గుంటూరు జిల్లా తెనాలి గీతాంజలి మృతి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. సంచలనం రేపుతోన్న ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న ఏపీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గీతాంజలిని ట్రోల్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి టీడీపీ కార్యకర్త ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గీతాంజలి కేసులో పోలీసులు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును విజయవాడలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. గురువారం ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు తమతో రావాలని కోరారు. అయితే తనకు ముందుగా నోటీసులు ఇవ్వనిదే తాను రానంటూ రాంబాబు పంతం పట్టారు.
నోటీసు ఇస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పారు. రాంబాబు కూతురు సైతం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే రాంబాబును స్టేషన్‌కు తరలించకుండా.. ఎక్కడెక్కడో తిప్పుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాంబాబు అరెస్ట్‌పై టీడీపీ స్పందించింది. 'టీడీపీ కార్యకర్త , సోషల్ మీడియా యాక్టివిస్ట్ పసుమర్తి రాంబాబుని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నాం అని చెప్పి, ఊరు మొత్తం తిప్పుతున్నారు. రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో పోలీసులు చెప్పటం లేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఉదయమే పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బాబాయ్‌ని అడ్డంగా నరికించిన వాడి పాలనలో, ఇంతకంటే ఏమి ఆశిస్తాం'అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.
వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలను పొగడటంతో తెనాలికి చెందిన గీతాంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అనూహ్యంగా చనిపోవడంతో.. రాజకీయంగా దుమారేగింది. గీతాంజలి మరణంపై అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనల మధ్య సోషలమీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. గీతాంజలి మరణానికి కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలో గీతాంజలి కేసులో టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారు. మరికొందర్ని కూడా గుర్తించారని.. త్వరలోనే అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.