పల్నాడు జిల్లాలో చోరీలు చేసే దొంగ ఆట కట్టించారు పోలీసులు. ఇటీవల నరసరావుపేట బస్టాండ్‌లో చిలకలూరిపేటకు చెందిన షహనాజ్ బంగారం చోరీ అయ్యింది. ఈ కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో 7న చిలకలూరిపేటకు చెందిన షహనాజ్ వినుకొండలో జరిగే వివాహ నిశ్చితార్థ వేడుకకు వెళ్తుతుండగా వినుకొండ బస్సు ఎక్కుతున్న సమయంలో తన చేతిలో ఉన్న బ్యాగులోని 213 గ్రాముల బంగారం అభరణాలు చోరీ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నరసరావుపేట ఎస్‌ఆర్‌కేటీ కాలనీ దగ్గర పాత నేరస్తులైన బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలోని తోటవారిపాలేనికి చెందిన కుంజా లక్ష్మీ, నల్లచెరువుకు చెందిన చిరుమామిళ్ల యశోదను నిందితులుగా గుర్తించారు. గతంలో వీరు బాపట్ల, ప్రకాశం, గుంటూరు పలు స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. కుంజా లక్ష్మీపై 10, యశోదపై మూడు కేసులు ఉన్నాయి. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఈ గ్యాంగ్ బస్టాండ్లలో, బస్సుల్లో చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు.