సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయమని కొందరు, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాలని మరికొందరు కోరుతున్నారు. నాకు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. దత్తాత్రేయుడి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్రమైన నేలగా పేరుగాంచిన పిఠాపురం నుంచి పోటీకి నిలబడుతున్నాను’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరదించారు. గురువారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన సోషల్ మీడియా ప్రతినిధులతో పవన్ సమావేశమయ్యారు. ఎంపీగా పోటీ చేయాలని చాలామంది సూచిస్తున్నారని, దానిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 2024 ఎన్నికల్లో జనసేన పోటీచేసే 21 స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ ఉండేలా ప్రతి కార్యకర్త, నాయకుడు పని చేయాలని పవన్ పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీతో కూడిన పొత్తును అందరూ ఆశీర్వదించి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తామని, ఏ ఒక్క పథకం ఆగిపోకుండానే ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘‘వచ్చే ఎన్నికల్లో మనం గెలుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ముందుకు సాగుతాం. జగన్ చేసిన తప్పులు కర్మల రూపంలో అనుభవించక తప్పదు. ఇంతమంది జనంతో కన్నీరు పెట్టించిన ప్రభుత్వం ఆ కన్నీటితోనే కూలిపోతుంది. జగన్‌ది అధికార దాహం, మదం. అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి. ఎవరినీ వదిలేది లేదు. అప్పు చేసిన డబ్బులు పంచుకుంటూపోతే శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే ఈ ముఖ్యమంత్రికి కూడా పడుతుంది’’ అని పవన్ హెచ్చరించారు. ‘జనసేనకు ఓట్లు పెరిగాయి, బలం పెరిగిందని ప్రత్యేక ఈగోతో వెళ్తే సీట్లు పెరిగేవి. కానీ సగటు మధ్యతరగతి మనిషి ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలని బలంగా కోరుకునే కోరికకు అడ్డంకులు ఏర్పడేవి. ఐదు కోట్ల ఆంధ్రుల భవిత కోసం ఎన్నికల్లో పోటీచేసే సీట్లు కొన్ని త్యాగం చేయక తప్పలేదు’ అని పేర్కొన్నారు.