మద్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానని గతంలో మాట ఇచ్చిన సీఎం జగన్ ఆ సంగతి మర్చిపోయారని, ఇంతకూ మద్య నిషేధం ఎప్పటి నుంచి అమలు చేస్తారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం కోవెలకుంట్ల పట్టణం లోని గడ్డవీధి ప్రాంతంలో బీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ పథకంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్‌్స్ పథకాలను ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ గతంలో మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పిన జగన్ ప్రస్తుతం గ్రామ గ్రామాన బెల్టు దుకాణాలు ఏర్పాటుచేశారని, వాటిని యథేచ్ఛగా వైసీపీ నాయకులు నడుపుతున్నారని అన్నారు. అమ్మవడి పథకం ఇస్తూ ఇక్కడ నాన్న బుడ్డిపథకం కింద విచ్చల విడిగా మందు, సారాయి అమ్మిస్తూ పదిరెట్లు ఎక్కువ వైసీపీ నాయకులు వసూలు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికలకు పూర్తి మద్య నిషేధం అమలు చేసి ఓట్లు అడుగుతానని ప్రగల్బాలు పలికి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని బీసీ ప్రశ్నించారు. 30 రోజుల్లో వైసీపీ పతనం కానుందని బీసీ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ పేరా శ్రీధర్‌రెడ్డి, గడ్డం నాగేశ్వరరెడ్డి, బీవి.ప్రసాద్‌రెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, సౌదరదిన్నె సుబ్బారెడ్డి, శంకరరెడ్డి, ధనుంజయుడు, దస్తగిరి, పెనుగొండరాజశేఖర్, కులాయి, గడ్డం అమరనాథరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.