‘‘పవన్ కల్యాణ్ మాట వేదం. తిరుపతి అభ్యర్థిని నేనే’’ అని జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం కపిలేశ్వర ఆలయంలో ఆరణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌తో చాలా సమయం మాట్లాడానని... ప్రతి మాట ఎంతో ఆలోచింపజేశాయని.. ఆయన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తిరుపతిలో అనేక మంది బంధువులున్నారని... వ్యాపారులున్నాయన్నారు. టీటీడీలోనూ కాంట్రాక్టులు తమ కంపెనీ ద్వారా చేస్తున్నామన్నారు. ఇల్లు ఉందని.. ఇకపై తాను తిరుపతిలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నానని వెల్లడించారు. టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీల నేతలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారన్నారు. ఒక రెండు రోజుల్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుపతిలో దొంగ ఓట్లతో రాజకీయాలు చేయటం ఇక సాధ్యం కాదన్నారు. బూత్ స్థాయిలో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటామని.. అందరి సహకారంతో తిరుపతి ఎమ్మెల్యేగా గెలుస్తాననని ధీమా వ్యక్తం చేశారు. రానున్నది టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వమే అని ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు.