ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. పార్టీల మధ్య నేతల వలసలు జోరందుకున్నాయి. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలక నేత టీడీపీ గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు, బీజేపీ నేత బైరెడ్డి శబరి రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె పసుపు కండువా కప్పుకున్నారు. నంద్యాల జిల్లా నేతలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లిన బైరెడ్డి శబరి రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, భూమా అఖిలప్రియ సహా పలువురు నేతలు ఆమె వెంట ఉన్నారు.
మరోవైపు నంద్యాల ఎంపీ స్థానంలో బైరెడ్డి శబరి రెడ్డిని బరిలోకి నిలుపుతారని తెలుస్తోంది. నంద్యాల జిల్లా ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న టీడీపీ.. శబరిని బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన కీలక నేతలు శబరిని బీజేపీ నుంచి టీడీపీలోకి తెచ్చేందుకు గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె టీడీపీలో చేరుతుందని, నంద్యాల లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తుందనే వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ శబరి రెడ్డి టీడీపీ గూటికి చేరారు.
మరోవైపు రాయలసీమలో బైరెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. ప్రత్యేక రాయలసీమ నినాదంతో పాటు రాయలసీమలో నీటి కోసం బైరెడ్డికి ఉద్యమాలు జరిపిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను బైరెడ్డి కుటుంబాన్ని తమవైపు తిప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో లాభిస్తుందనే ఆలోచనలోచంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగా శబరిని పార్టీలో చేర్చుకున్నారని, నంద్యాల లోక్‌సభ టీడీపీ ఎంపీ టికెట్ ఆమెకు ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె అనుచరులు సంబరాలు కూడా జరుపుకున్నారు.