సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఏపీలోని అంగన్‌వాడీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిమాండ్ల సాధన కోసం జనవరిలో అంగన్వాడీలో రోడ్డెక్కారు. 42 రోజుల పాటు సమ్మెచేశారు. అయితే ఈ సమ్మెకాలంలో వారి జీతాల్లో కోతపడింది. అయితే బకాయిలను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు జీవో కూడా జారీ చేసింది.
అంగన్వాడీలు సమ్మె చేసిన కాలాన్ని విధినిర్వహణలోనే ఉన్నట్లు లెక్కించాలని, ఆ మేరకు చెల్లించాల్సిన వేతనాలను విడుదల చేయాలంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 12 నుంచి ఈ ఏడాది జనవరి 22 వరకూ మొత్తం 42 రోజుల సమ్మె కాలంలో చెల్లించాల్సిన వేతనాన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు మున్సిపల్ కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. సమ్మె సమయంలోనూ మున్సిపల్ కార్మికులపై నమోదైన కేసులు ఎత్తివేస్తూ హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా అంగన్వాడీలకు సైతం సమ్మె సమయానికి వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
వేతనాలు పెంపు సహా పది డిమాండ్ల సాధన కోసం గతేడాది డిసెంబర్ 12 నుంచి జనవరి 22వరకూ ఏపీవ్యాప్తంగా అంగన్‌వాడీలు సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు మూతపడగా.. పలుచోట్ల వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సాయంతో అంగన్వాడీలను అధికారులు తెరిపించారు. అయితే 42 రోజుల తర్వాత ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాలు జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో అంగన్వాడీలు సమ్మెను విరమించుకున్నారు. చర్చల సందర్భంగా వేతనాలను జులైలో పెంచుతామని, సమ్మెకాలానికి వేతనాలిస్తామని మంత్రుల బృందం అంగన్వాడీ సంఘాలకు హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాటప్రకారం సమ్మెకాలానికి వేతనాలు విడుదలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు.