సీబీఐ మాజీ జేడీ, భారత్ పార్టీ అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ మనసు మార్చుకున్నారు. ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించిన ఆయన పోటీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. విశాఖ ఎంవీపీకాలనీ సెక్టారు-10లోని ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. గతంలో జనసేన పార్టీ తరఫున తాను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని, ప్రస్తుతం తమ పార్టీ నిర్ణయం మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు.
ఫ్రంట్ తరఫున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తారని, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు డాక్టర్ కె శివ భాగ్య రావు బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని, ప్రబుద్ధ రిపబ్లిక్ అండ్ పార్టీ అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు కొండేపి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని లక్ష్మీనారాయణ వివరించారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంటు ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన పోయిందని.. చట్టాల రూపకల్పనలో ప్రజల అభిప్రాయం తీసుకోవటం లేదన్నారు. రాష్ట్రంలో గ్రూపు-1ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. ఫ్రంట్ సమన్వయకర్త చంద్రశేఖర్ పాల్గొన్నారు. లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రజలకు అందించాలని చెబుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి కనీసం కొద్ది మందైనా దారిద్రరేఖకు పైకి వచ్చారని చెప్పగలరా విజయ్ కుమార్ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసి, రెండు కులాలు నాలుగు పార్టీల పాలనను అంతం చేయాలని ఆయన కోరారు.
మరోవైపు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఈసీ కేటాయించింది. ఆయన సారథ్యంలోని జైభారత్ నేషనల్ పార్టీకి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్ సింబల్‌గా టార్చిలైట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కామన్ సింబల్ కేటాయించడం పట్ల ఈసీకి ధన్యవాదాలు తెలియజేశారు లక్ష్మీనారాయణ. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీని స్థాపించారు. అయితే ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు.. కానీ అనూహ్యంగా మనుసు మార్చుకున్నారు. ఇప్పుడు విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడం ఆసక్తికంరగా మారింది.