లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న సందర్భంగా గత కొన్ని రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ రోడ్ షోలు, బహిరంగ సభలు, ప్రారంభోత్సవాలు, రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా మారిన ప్రధాని మోదీ.. అన్నీ తానై అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ.. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే తన ప్రభుత్వ అభివృద్ధి, పథకాలు, నిర్ణయాలు, చట్టాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను తమవైపు ఆకర్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు తమిళనాడులో అనుమతి లభించలేదు. దీంతో బీజేపీ నేతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల పర్యటన చేపట్టిన మోదీ.. వచ్చేవారం మరోసారి తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ నెల 18 వ తేదీన కోయంబత్తూర్‌లో ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు. ఆర్ఎస్ పురంలో 3.6 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రోడ్ షోకు దాదాపు లక్ష మంది పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ప్రధాని రోడ్ షోకు తమిళనాడు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. భద్రతాపరమైన కారణాలు, ప్రజలకు అసౌకర్యం, ముఖ్యంగా విద్యార్ధులకు ఇబ్బంది కలుగుతుందని సహా వివిధ కారణాల దృష్ట్రా కోయంబత్తూరు జిల్లా పోలీసు అధికారులు ప్రధాని ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతోపాటు రోడ్‌షో కోసం బీజేపీ నిర్ణయించిన మార్గంలో మత ఘర్షణలు చెలరేగేందుకు అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చేసే కోయంబత్తూరులోని ఆర్‌ఎస్ పురంలో 1998లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పటి నుంచి ఆర్ఎస్ పురం ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ మతపరమైన ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున ఏ రాజకీయ పార్టీలు, సంఘాలకు రోడ్‌షోలకు అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18 న తలపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి తమిళనాడు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తమిళనాడు పోలీసులు మోదీ రోడ్ షోకు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ నేతలు.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మోదీ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.