పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆదివారం జరగనున్న ‘ప్రజాగళం’ బహిరంగ సభకు అంగరంగ వైభవంగా చేస్తున్న ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జత కట్టిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తొలి సభ కావడం, ప్రధాని మోదీ హాజరు కానుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ, జనసేన పార్టీలు అంతే ప్రతిష్టాత్మకంగా సభకు ఏర్పాట్లు చేశాయి. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా కూటమి తొలి భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా లోక్‌సభ స్థానాల నుంచి కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఉరిమే ఉత్సాహంతో తరలిరానున్నారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్‌హాజరుకానున్నారు. ఇప్పటికే మంచి జోష్ మీదున్న క్యాడర్.. అధినేతలు ఇచ్చే సందేశంతో మరింత ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో పనిచేసి, కూటమి అఖండ విజయానికి కృషి చేయనున్నారు. వేదిక వద్ద వసతులు, వాహనాల పార్కింగ్, తాగునీరు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర చరిత్రలో ఈ సభ ఒక మైలు రాయిగా నిలుస్తుందని కూటమి నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏర్పాట్లను ప్రజాగళం సభ ప్రత్యేక కమిటీ నేతలు పరిశీలించారు. ఎనిమిది అడుగుల ఎత్తున వేదికను నిర్మించారు. అగ్ర నాయకులు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3,900 మంది పోలీసులను విధులకు రప్పించారు. వేదిక మొత్తం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆధీనంలోకి వెళ్లింది. విధులు నిర్వహించే పోలీసులతో ఉన్నతాధికారులు శనివారం సమావేశం నిర్వహించారు. హెలిప్యాడ్, సభా వేదిక వద్ద డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. శనివారం హెలికాప్టర్లు ట్రయల్ రన్ వేశాయి. జాతీయ రహదారికి ఇరువైపులా విశాలమైన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి సభా ప్రాంగణానికి సులువుగా చేరుకునేందుకు వీలుగా ఎక్కడికక్కడ మార్గాలు ఏర్పాటు చేశారు. ఆరు హెలిప్యాడ్లు సిద్ధం చేయగా వాటిలో మూడు ప్రధాని బృందానికి కేటాయించారు. సభకు తరలివచ్చే లక్షలాది మంది జనం కోసం పసందైన భోజనాలు, బిర్యానీ, మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రాంగణంలో ఎక్కడ నిలబడ్డా వేదికపై ఏం జరుగుతోందో వీక్షించేలా పదుల సం ఖ్యలో ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. కాగా, ఎన్నికల వేళ జరుగుతున్న ‘ప్రజాగళం’లో మోదీ ప్రస్తావించే అంశాలపై ఆసక్తి నెలకొంది. 2015, అక్టోబరు 22న అమరావతి రాజధాని శంకుస్థాపనకు హాజరైన మోదీ ఇది ప్రపంచ స్థాయిలో భాసిల్లుతుందని ఆకాంక్షించారు. ము ఖ్యంగా ఇప్పుడు కొత్త రాజధాని రైతులు ప్రధాని మోదీ ప్రజాగళం వేదికగా ఇచ్చే వరాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు సీఎం పీఠం అధిష్టిస్తారనే ఆశ చిగురించటంతో పాటు ఎన్‌డీఏలో చేరటం తో మోదీ సహకారంతో రాజధానికి పూర్వ వైభవం వస్తుందనే ఆనందం రైతుల కళ్లలో కనిపిస్తోంది.