ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొంటారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో 60 శాతం ఉపాధ్యాయులే ఉన్నారని, వారు లేకుండా ఎన్నికలే జరగవన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఇంకు పెట్టడం వంటి విధులకు మాత్రమే వినియోగిస్తామన్నారు. వలంటీర్లు కూడా ప్రభుత్వంలో భాగమేనని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదనే నిబంధనలు వారికి వర్తిస్తాయన్నారు. శనివారం అమరావతి సచివాలయంలో కోడ్‌కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కోడ్ అమలులో ఉండగా కొత్త పనులు, కొత్త పథకాలు ప్రారంభించకూడదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, మంత్రుల ఫొటోలు ఉంచకూడదన్నారు. ప్రభుత్వం జారీ చేసే పత్రాలపై నేతల ఫోటోలు ఉండకూడదని తెలిపారు. ప్రభుత్వ విజయాల పేరిట ప్రజాధనంతో ఇచ్చే ప్రకటనలు నిలిపేయాలన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, కొత్త లబ్ధిదారుల ఎంపిక ఇకపై చేయకూడదన్నారు. శంకుస్థాపనులు, ప్రారంభోత్సవాలు చేయకూడదన్నారు. మతపరమైన కార్యక్రమాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదని తెలిపారు.