ఏపీలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష కట్టుదిట్టంగా జరిగింది. అయితే ఒంగోలులో మాత్రం ఓ అభ్యర్థి కాపీయింగ్‌కు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఒంగోలులోని వెంగముక్కపాలెం రోడ్డులో ఉన్న క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఓ అభ్యర్థి మొబైల్ సాయంతో కాపీయింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ప్రశ్నలకు సమాధానాలను ఫోన్ ద్వారా తెలుసుకుని రాస్తుండగా ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
అయితే పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టకముందే ఎంట్రన్స్‌లోనే అధికారులు అభ్యర్థులను పూర్తిగా తనిఖీ చేస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేస్తారు. 144 సెక్షన్ కూడా విధిస్తారు. అయితే అన్నీ ఉన్నప్పటికీ అభ్యర్థి సెల్ ఫోన్ పరీక్ష హాలులోకి ఎలా తీసుకెళ్లగలిగాడనేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై పోలీసులు అతన్ని ప్రశ్నిస్తు్న్నట్లు సమాచారం.
మరోవైపు ఏపీవ్యాప్తంగా 301 కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్షను నిర్వహించారు. మొత్తం లక్షా 48 వేల మందికిపైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించారు. రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్ష జరిగే తీరును అధికారులు పర్యవేక్షించారు. మరోవైపు పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడితే ఇంకెప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉండదని అధికారులు హెచ్చరిస్తున్నారు.