వైసీపీ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మీద జనసేన నేతలు ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ ఓనమాలు రావంటున్న ముద్రగడ.. అంతగా రాజకీయాలు వస్తే ఎందుకు సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేయలేదని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం ఎప్పటి నుంచో వైసీపీ కోవర్టు అంటూ మండిపడ్డారు. తిరుపతిలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన జనసేన నేత కిరణ్ రాయల్.. ముద్రగడపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో మొలతాడు లేనివాళ్లు కూడా తనకు సలహాలిస్తున్నారన్న ముద్రగడ వ్యాఖ్యలకు కిరణ్ రాయల్ కౌంటర్ వేశారు.ముద్రగడ పద్మనాభఁ వైసీపీ కోవర్ట్ అని మేము ముందే చెప్పామన్న కిరణ్ రాయల్.. కానీ చాలామంది కాపు ప్రజలు నమ్మలేదని అన్నారు. 2016-17 సమయంలో ఉద్యమం చేసినప్పుడు జగన్, బొత్స ఇచ్చిన నిధులతో తుని సభ పెట్టారని ఆరోపించారు.
"పవన్ కళ్యాణ్‌కు రాజకీయ ఓనమాలు రావంటున్నావ్. మరి నీకు వచ్చినప్పుడు నువ్వెందుకు సొంతంగా పార్టీ పెట్టలేదు. మొలతాటు లేనివాడు కూడా నాకు రాజకీయాలు చెప్తాడా అంటావ్. పవన్ కళ్యాణ్‌కు మొలతాడు ఉందో లేదో నువ్వు చూశావా. నీకు మొలతాడు ఉన్నప్పుడు పార్టీ పెట్టి, నువ్వో, నీ కొడుకో పోటీ చేయండి. ముద్రగడ పద్మనాభం వైసీపీలో నెలజీతానికి పనిచేస్తున్నారు. జనసేనను మూసేస్తారంటున్నావ్. నువ్వేమైనా జాతకాలు చెప్తున్నావా. జగన్ దగ్గర ఏం హామీ తీసుకుని వైసీపీలో చేరావ్".. అని కిరణ్ రాయల్ ప్రశ్నించారు.
మొలతాడు ఉంటే చేయ్.. ముద్రగడకు కిరణ్ రాయల్ స్ట్రాంగ్ వార్నింగ్
మరోవైపు కాపుల మద్దతు లేక, వెనుకవచ్చే జనం లేక సెక్యూరిటీ కారణాలనే పేరుతో ముద్రగడ పద్మనాభం ర్యాలీని రద్దుచేసుకున్నారని కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం కాపులకు చేసిందేమీ లేదన్న కిరణ్ రాయల్.. కాపుల కోసం పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ జోలికొచ్చినా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా పిచ్చికుక్కను కొట్టినట్లు కొడతామంటూ కిరణ్ రాయల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి నేతలు వీలైతే కాపు యువతకు సలహాలు ఇవ్వాలన్న కిరణ్ రాయల్.. జగన్ ట్రాప్‌లో పడి ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు ముద్రగడ పద్మనాభం ఇటీవలే వైసీపీలో చేరారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మరుసటి రోజే విలేకర్ల సమావేశం నిర్వహించిన ముద్రగడ పద్మనాభం .. పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన పార్టీ క్లోజ్ అవుతుందని అన్నారు. అలాగే రాజకీయాల్లో మొలతాడు లేనివాళ్లు కూడా తనకు సలహాలు చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ వ్యాఖ్యలపై జనసేన నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.