అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్-ఎఫ్‌సీపీఏను నిలిపివేయాలని అమెరికా న్యాయ శాఖను ఆదేశించారు. 50 ఏళ్ల క్రితం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని నిలిపివేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. అయితే ఈ నిర్ణయం అదానీ గ్రూప్‌కు బిగ్ రిలీఫ్ కల్పించినట్లయింది. ఎందుకంటే భారత్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టుల వ్యవహారంలో లంచాలు ఇచ్చారన్న ఆరోపణలతో అమెరికాలో అదానీ గ్రూప్‌పై కేసు నమోదు కాగా.. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చట్టాన్ని నిలిపివేయడం ద్వారా అదానీ గ్రూప్‌పై విచారణ తాత్కాలికంగా వాయిదా పడనుంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా అదానీ గ్రూప్ షేర్లు కాస్త లాభపడ్డాయి.
భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు.. అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు కొన్ని నెలల క్రితం సంచలన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిధుల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్-ఎఫ్‌సీపీఏ చట్టం కింద అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో అదానీ గ్రూప్‌లో తీవ్ర కలవరం నెలకొంది. మరోవైపు.. మదుపర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొనడంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనం అయ్యాయి.
అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఈ ఎఫ్‌సీపీఏ అమలును నిలిపివేయాలని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బొండికి ఆదేశాలు జారీ చేశారు. 6 నెలల్లోగా ఎఫ్‌సీపీఏ చట్టం మార్గదర్శకాలు, విధివిధానాలను సమీక్షించాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించారు. తాజాగా ట్రంప్ జారీ చేసిన ఆదేశాలతో వచ్చే 6 నెలల పాటు ఈ ఎఫ్‌సీపీఏ చట్టం కింద ఎలాంటి దర్యాప్తులు చేపట్టకూడదు. అయితే 6 నెలలో తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఏం నిర్ణయం తీసుకుంటుందనే దాన్ని బట్టి తర్వాత పరిణామాలు ఉండనున్నాయి. దీంతో ప్రస్తుతానికి అదానీ గ్రూప్‌కు భారీ ఊరట లభించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అదానీ గ్రూప్ స్టాక్స్ మంగళవారం ఉదయం లాభపడ్డాయి. అయితే చివరికి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూడటంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.37 శాతం, అదానీ పవర్ 0.47 శాతం లాభంతో ముగించాయి.
అమెరికాకు చెందిన కంపెనీలు గానీ, వ్యక్తులు గానీ, విదేశాల్లో అవినీతి వ్యవహారాల్లో భాగస్వాములు కాకుండా ఉండేందుకు అమెరికాలో ఈ ఎఫ్‌సీపీఏ చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించి.. అవినీతికి పాల్పడితే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అందుకు ఆయా చట్టాల ప్రకారం కఠిన శిక్షలు విధిస్తారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలతో ఎఫ్‌సీపీఏ, సెక్యూరిటీస్ అండ్ వైర్ ఫ్రాడ్, లంచం అభియోగాలతో కేసులు నమోదయ్యాయి.
![]() |
![]() |