ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జనవరి 13న మొదలుకాగా.. ఇప్పటి వరకూ 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. దాదాపు నెల రోజులు పూర్తవుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. రోజూ లక్షల్లో ప్రయాగ్‌రాజ్‌కు తరలి వస్తున్నారు. మొత్తం ఆరు అమృత స్నానాలకు గానూ.. ఇప్పటికే నాలుగు పూర్తయ్యాయి. జనవరి 13న భోగి, ఆ మర్నాడు 14న మకర సంక్రాంతి, జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజుల్లో జరిగిన ఈ స్నానాలకు సాధారణ రోజుల కంటే రెట్టింపులో యాత్రికులు హాజరయ్యారు. ఇక, ఐదో అమృత స్నానానికి సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 12న బుధవారం మాఘ పౌర్ణమి రోజున జరిగే ఐదో రాజస్నానానికి భక్తులు భారీగా తరలిరానున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి కొత్త ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. జనవరి 29 మౌని అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్‌రాజ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. రద్దీ నియంత్రించడానికి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి కుంభమేళా జరుగుతోన్న ప్రదేశాన్ని నో-వెహికల్ జోన్‌గా ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ సిటీ మొత్తానికి వీటిని అమలు చేయనున్నారు. వివిధ మార్గాల నుంచి నగరానికి వచ్చే యాత్రికుల వాహనాల కోసం సిటీ వెలుపలే ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేశారు.
బుధవారం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసిన అనంతరం.. అక్కడ నుంచి భక్తులు సజావుగా బయటకు వెళ్లే వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. అవసరమైన, అత్యవసర సేవల వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. సంగమం వద్ద నిర్ణీత కాలం పాటు ఉండే కల్పవాసీల వాహనాలకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. సోమవారం రాత్రి పోలీసులు, మున్సిపల్ అధికారులతో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమావేశమై.. మాఘ పౌర్ణమి రాజస్నానం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ట్రాఫిక్, రద్దీని నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు, నగరంలో ఉన్న 5 లక్షల వాహనాల సామర్థ్యం కలిగిన పార్కింగ్ స్థలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్లపై వాహనాలు బారులు తీరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మౌని అమావాస్య రోజున చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. బారికేడ్లను తోసుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట జరిగినట్టు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలు బయటపెట్టాయి. ఈ ఘటననై న్యాయ విచారణకు ముగ్గురు సభ్యుల కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
![]() |
![]() |