బీహార్ రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకొంది. వాట్సాప్‌లో తాను పెళ్లిచేసుకున్నానని, పెద్దలు అంగీకరించడం లేదంటూ ఇంటర్ విద్యార్ధి ఒకరు పోలీస్ స్టేషన్‌కు వచ్చి రచ్చ రచ్చ చేశాడు. తన భార్యతో కలిసి జీవించడానికి సాయం చేయాలని కోరాడు. అసాధారణమైన ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ముజఫర్‌పూర్‌కి చెందిన ఇంటర్ విద్యార్ధిని.. విద్యార్ధి మధ్య రెండేళ్ల నుంచి స్నేహం కొనసాగుతోంది. ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడటంతో ప్రేమగా మారింది. ఈ క్రమంలో బాలుడు వాట్సాప్‌లో తన స్నేహితురాలికి ‘నిఖా కబూల్ హై’ (నీకు పెళ్లి సమ్మతమేనా) అని మెసేజ్ చేయగా.. ఆమె అందుకు సరే నంటూ రిప్లై ఇచ్చింది. మూడుసార్లు ఇలా చెప్పడంతో మన పెళ్లి అయిపోయిందన్నాడు. అయితే, ఈ విషయం తెలిసిన ఇరు కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
పిల్లల చర్యపై పోలీసులను ఆశ్రయించిన పెద్దలు.. వారికి పరిస్థితి అర్ధమయ్యేలా చెప్పాలని కోరారు. దీంతో బాలుడ్ని ఆదివారం నాడు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి.. కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అతడు మాత్రం ససేమిరా అన్నాడు. రెండు గంటల పాటు స్టేషన్‌లో నా నా హంగామా చేసి.. పోలీసులకు విసుగుతెప్పించాడు. అతడి ప్రవర్తనకు పోలీసులకు చిర్రెత్తుకొచ్చినా సంయమనం పాటించారు.
తామిద్దరం రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, వాట్సాప్‌లో పెళ్లిచేసుకున్నామని చెప్పాడు. అంతేకాదు, తనను భర్తగా అంగీకరించిందని, రహస్యంగా కలుసుకున్నప్పుడు ఆమె నుదుట సింధూరం కూడా దిద్దానని తెలిపాడు. ఆమె తన గర్ల్‌ఫ్రెండ్ అని, ఎలాగైనా తమ పెళ్లి చేసుకోడానికి అనుమతించాలని ఆ బాలుడు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో అతడి మొబైల్ ఫోన్‌లో ఫోటోలు, వాట్సాప్ చాట్‌లను పోలీసులు గుర్తించారు.
పోలీసుల కౌన్సిలింగ్ ఇచ్చి అతడికి నచ్చజెప్పాలని చూశారు. కానీ, అతడి ఆలోచన మాత్రం మారలేదు. తన భార్యతో ఉంటానని పట్టుబట్టాడు. దీంతో విస్తుపోయిన పోలీసులు.. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోడానికి ఇరు కుటుంబాల ఫిర్యాదుల కోసం ఎదురుచుస్తున్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిస్థితిని చిక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇరువురూ మైనర్లే కాదు, వేర్వేరే సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |