విష్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. లైలా సినిమాలో తన పాత్ర పేరు మేకల సత్యం అని, ఓ సీన్ లో తన మేకల సంఖ్య 150గా ఉంటుందని, క్లైమాక్స్ కు వచ్చేసరికి వాటి సంఖ్య 11కి పడిపోతుందని, అదెలా జరిగిందో తనకు అర్థం కావడం లేదని పృథ్వీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇది తమను గురించే అంటూ పృథ్వీపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ మామూలుగా లేదు. తాజాగా, వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి కూడా ఘాటుగా స్పందించారు. మా పార్టీ అభిమానులను, కార్యకర్తలను, నాయకులను, మా అధినేతను ఎవరు కించపరిచినా వాళ్లకు మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు. అయితే తాము సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదని తెలిపారు. "విష్వక్సేన్ గారు... మేం మీ లైలా సినిమాకి వ్యతిరేకం కాదు. మాపై జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే మేం వ్యతిరేకం. ఇప్పటి నుంచి అలాంటి ఆర్టిస్టు ఉన్న ప్రతి సినిమాకి మేం వ్యతిరేకం. టికెట్ కొని మరీ మాపై మీతో జోకులు వేయించుకునేంత పిచ్చి గొర్రెలం మాత్రం కాదు" అని పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. అంతేకాదు... మన మీద జోకులు వేసే ఆర్టిస్ట్ ఉండే ప్రతి సినిమాను బాయ్ కాట్ చేయండి... సినిమా ఇండస్ట్రీని మాత్రం కాదు అని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, నటుడు పృథ్వీ హైబీపీతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.