ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని.. రెండూ ఒకటేనని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉందని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీపై విమర్శలు చేశారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ రెండు సంకల్పాలు తీసుకోవాలన్న మోదీ.. కేంద్రంలో ఎన్డీయే సర్కారును ఏర్పాటు చేయటం, రెండోది ఏపీలోని అవినీతి ప్రభుత్వం గద్దెదించడం అని అన్నారు. ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుబడిందన్న మోదీ.. ఏపీ అభివృద్ధి కావాలని అనుకుంటే ఎన్డీయే కూటమికి ఓటేయాలని కోరారు. ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదనీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని మోదీ విమర్శించారు.
వారు వాడుకుని వదిలేసే రకం..
బొప్పూడి సభలో కాంగ్రెస్ పార్టీపైనా మోదీ విమర్శలు గుప్పించారు. వారు వాడుకుని వదిలేస్తారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో ఒకపార్టీ అంటే మరో పార్టీకి పడదని అన్నారు. ఎన్నికలకు ముందే విభేదాలు బయటపడ్డాయని.. ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలని సెటైర్లు వేశారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీలను కలుపుకుని వెళ్తామన్న మోదీ.. కాంగ్రెస్ పార్టీ మాత్రం వాడుకుని వదిలేస్తుందని ఎద్దేవా చేశారు.
రాముడంటే గుర్తొచ్చేది ఆయనే..
ప్రజాగళం సభలో ప్రధాని మోదీ.. ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. రాముడన్నా, కృష్ణుడన్నా గుర్తొచ్చేది నందమూరి తారక రామారావేనని అన్నారు. రాముడు, కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని కొనియాడారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా వంద రూపాయల వెండి నాణెం విడుదల చేసినట్లు గుర్తు చేశారు. తెలుగువారికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానంతోనే టీడీపీ పుట్టినట్లు మోదీ గుర్తు చేశారు. ఇక ఐదేళ్లలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని మోదీ ప్రస్తావించారు. ఏపీ ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ పథకాల వలన కలిగిన లబ్ధిని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఆశీర్వదించాలని కోరారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో సీఎం జగన్ మీద పెద్దగా విమర్శల జోలికి పోలేదు. జగన్ పేరును కేవలం ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. ప్రసంగంలో ఎన్డీయే విజయాలు వివరించిన మోదీ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఏపీలో కాంగ్రెస్, జగన్ పార్టీ ఒకటేనని విమర్శించారు.