మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది . పిల్లల సంరక్షణ సెలవులు (చైల్డ్ కేర్ లీవ్స్)కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల సంరక్షణ సెలవులకు సంబంధించి గతంలో విధించిన గడువును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తమ పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేలోగా మహిళా ఉద్యోగులు ఈ సెలవులను వాడుకోవాల్సి ఉండేది. కానీ ఏపీ ప్రభుత్వం ఈ గడువును తొలగించింది. దీంతో ఉద్యోగ విరమణలోగా మహిళా ఉద్యోగులు ఎప్పుడైనా ఈ సెలవులను వాడుకునే వీలుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అమరావతి రాజధాని పరిధిలో.. సచివాలయ ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెక్రటేరియట్ ఉద్యోగులకు అమరావతిలోని పిచ్చుకలపాలెం గ్రామ పరిధిలో స్థలాలు కేటాయిస్తున్నట్లుగా ఏపీ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీవో జారీ చేశారు. 2019లో గవర్నమెంట్ ఉద్యోగులకు అమరావతిలో స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలోని రూల్స్ ప్రకారమే.. ఇప్పుడు కూడా స్థలాల విస్తీర్ణం, ధర ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.
మరోవైపు శనివారం ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందు ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే శుక్రవారమే ఉద్యోగులు, పింఛన్ దారులకు డీఏల మంజూరు, మున్సిపల్ కార్మికులపై సమ్మెకాలంలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు సమ్మెకాలానికి గానూ వేతనాలను సైతం మంజూరు చేయాలని ఆదేశించారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయనే ప్రభుత్వం హడావిడిగా నిర్ణయాలు తీసుకుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.