తిరుమలలో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో ఉత్సవర్లు విహరించే తెప్పను ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేశారు. నీటిపై గాలితో కూడిన డ్రమ్ములను ఏర్పాటు చేసి, దానిపై మండపం రూపంలో ఉండే తెప్పను నిర్మించి.. రంగులు అద్దుతున్నారు. తొలిరోజున సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా రామచంద్రమూర్తి తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండో రోజున రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు. మూడో రోజున శ్రీభూ సమేతంగా మలయప్పస్వామి మూడుసార్లు పుష్కరిణిలో విహరించి, భక్తులను అనుగ్రహిస్తారు. నాల్గవ రోజున ఐదుసార్లు, చివరిరోజు ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారు.