ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రెండు హత్యలు దారుణం.. ఏపీలో శాంతి భద్రతలపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2024, 07:15 PM

ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీ మరింత రాజకీయ హింసకు దిగుతోందన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న వైఎస్సార్సీపీ మూకలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయని అన్నారు. ప్రజాగళం సభకు వచ్చారన్న కారణంతో గిద్దలూరు నియోజకవర్గం, గడికోటకు చెందిన మూలయ్యను గొడ్డళ్లతో నరికి దారుణంగా చంపేశారన్నారు.


ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగలమర్రిలో ఇమామ్ హుస్సేన్ అనే 21 ఏళ్ల యువకుడిపై కత్తులతో దాడి చేసి బలి తీసుకున్నాయన్నారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త సురేష్ కారును తగలబెట్టారన్నారు. ఈ మూడు ఘటనలపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ గూండాల హత్యా, ఫ్యాక్షన్ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.


ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వైఎస్సార్‌సీపీకి అత్యంత అనుకూలమైనవారేనన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న ముగ్గురు ఎస్పీల అండచూసుకునే వైఎస్సార్‌సీపీ గూండాలు చెలరేగుతున్నారన్నారు. కోడ్ అమల్లో ఉన్నసమయంలో ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలపై తక్షణం దృష్టి సారించాలని కోరారు. ఎన్నికల ముంగిట పెచ్చురిల్లుతున్న రాజకీయ హింస, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు.


వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడిలోనే టీడీపీ కార్యకర్త మూలయ్యను తీవ్రంగా గాయపడి చనిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్‌లో సోమవారం ఆయనపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశరని.. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని తొలుత గిద్దలూరు నుంచి కర్నూలుకు.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారన్నారు. మూలయ్య అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం చనిపోయారు. చిలకలూరిపేట సమీపంలో నిర్వహించిన ప్రజాగళం సభకు జనాన్ని తరలించాడనే అక్కసుతో మూలయ్యను వైఎస్సార్2సీపీ కార్యకర్తలు చంపేశారని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడులు చేసేవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మునయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.


మరోవైపు పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ నేత కారును వైఎస్సార్‌సీపీ అల్లరి మూకలు తగులబెట్టాయనే ఆరోపణలు వస్తున్నాయి. మాచర్ల 10వ వార్డు కి చెందిన టీడీపీ నేత వీర్ల సురేష్‌కి చెందిన కారును వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తగలబెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. తన ఇంటి ముందు కారు నిలుపు చేసేందుకు స్థలం లేక పోవడంతో తన ఇంటికి సమీపంలోని సెయింట్ జేవీఆర్ స్కూల్ గేట్ ముందు సురేష్ పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో మంటల్లో కారు తగలబడటాన్ని సురేష్ కుటుంబ సభ్యులు గమనించారు. ఇది కచ్చితంగా వైఎస్సార్‌సీపీ వాళ్లు చేసిన పనేనని సురేష్ ఆరోపిస్తున్నాడు. ఈ రెండు ఘటనలపై చంద్రబాబు స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa