ఏపీలో ఎన్నికల సందడి కనిపిస్తోంది.. పార్టీలన్నీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ఓవైపు.. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా మరోవైపు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారానికి అన్ని అస్త్రాలను ఉపయోగించేందుకు ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీకి ప్రాధాన్యత ఆసక్తికరంగా మారింది. సోమవారం రాత్రి తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్లను రాధా కలిశారు.
ఇద్దరు నేతలు మంచి మిత్రులు కావటంతో సాధారణ విషయాలతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల క్రమంలో.. ప్రధానంగా రాజకీయ అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వంగవీటి రంగా వారసుడిగా రాధా కూడా ప్రచారంలో పాల్గొంటే చాలావరకు ప్రభావం ఉంటుందనే ఆలోచనతో ఉన్నారనేది సమాచారం. ఇప్పటికే కాపు నాయకులు కొందరు వైఎస్సార్‌సీపీలో చేరడంతో.. వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు రాధా వంటివారి సేవలు అవసరమేననేది ఆ పార్టీల ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఇద్దరు నాయకులూ ఈ అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తాము మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశామని చెబుతున్నారు.