ఏపీలో రైలు ప్రయాణికులకు శుభవార్త . ప్రయాణికుల సౌకర్యార్థం డిబ్రూఘర్ - కన్యాకుమారి - డిబ్రూఘర్ వివేక్ ఎక్స్‌ప్రెస్‌ను వారానికి ఐదు రోజులపాటు నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఇప్పటివరకు వారానికి నాలుగు రోజులు నడుస్తుండగా.. ఈ నెల 22 నుంచి డిబ్రూఘర్-కన్యాకుమారి (22504) ఎక్స్‌ప్రెస్ మంగళ, గురు, శుక్ర, శని, ఆదివారాల్లో.. ఈ నెల 26 నుంచి కన్యాకుమారి-డిబ్రూఘర్ (22503) ఎక్స్‌ప్రెస్ సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ ఏపీలోని పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుంది.
మరోవైపు విశాఖ-తిరుపతి ప్రత్యేక రైలు రీ షెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. లింక్ రైలు ఆలస్యంగా నడుస్తుండడంతో విశాఖ-తిరుపతి (08583) ప్రత్యేక రైలును రీ షెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం రాత్రి 7.10 గంటలకు బదులు 3 గంటలు ఆలస్యంగా రాత్రి 10.10గంటలకు బయలుదేరేలా మార్పు చేశామన్నారు. ప్రయాణికులకు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. వివేక్ ఎక్స్‌ప్రెస్ విషయాన్ని గమనించి అందుకు తగిన విధంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు అధికారులు.