ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ ఏపీకి వస్తే భద్రత కల్పించరా.. ఎన్నికల సంఘానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2024, 08:15 PM

తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి ‘ప్రజాగళం’ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి అశేష ప్రజానీకం హాజరైందన్నారు ఎన్డీఏ పక్ష నేతలు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి హాజరైన విషయాన్ని గుర్తు చేశఆరు.ప్రజాగళం సభకు భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీజీపీకి ఎన్డీఏ నేతలు లేఖ రాశారని.. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సభకు నిరంతరం అంతర్యాలు వస్తూన్నా పోలీసులు మాత్రం నిర్లక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్డీఏ నేతలు వర్ల రామయ్య, పాతూరి నాగభూషణం, చిల్లపల్లి శ్రీనివాసరావు, బుచ్చి రాంప్రసాద్, షేక్ బాజి, బండ్రెడ్డి రామకృష్ణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.


ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ బరితెగించి వ్యవహరిస్తోందని తెలుగుదేశం సీనయర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. చట్టంతో పని లేదు.. తమ విధి విధానాలంటే గౌరవం లేదన్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం సభకు సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారని.. ఈ సభకు మేము ఊహించిన దానికంటే లక్షలాది మంది కదలి వచ్చారన్నారు. ఈ సభకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లు చేయండని ఈ నెల 12వ తేదీన రాష్ట్ర డీజీపీకి తెలుగుదేశం పార్టీ నుంచి లేఖ పంపించామని.. కానీ నిమ్మకు నీరెత్తినట్లు పోలీసులు కూర్చొని సభను చిన్నాభిన్నం చేసేందుకు కుట్రపన్నారన్నారు. తాము ఎంత చెప్పినా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించలేదని.. విద్యుత్, సౌండ్ బాక్సుల స్తంబాలు పైకి అభిమానులు, కార్యకర్తలు ఎక్కితే, వారిని దింపేందుకు సాయంచేయమని తాము, తమ పార్టీల వాలంటీర్లు పోలీసు వారిని కోరినా పట్టించుకోలేదన్నారు. ప్రోటోకాల్‌ను కూడా ఉల్లంఘించి విద్యుత్ స్తంభాలు దిగాలని స్వయంగా ప్రధానే విజ్ఞప్తి చేశారని.. ప్రదాని సభ అనుకున్నారో, దారిన పోయే దానయ్య సభ అనుకున్నారో తమకు అర్థం కాలేదన్నారు.


పల్నాడు ఎస్పీ అనవసరంగా ఖాకీ చొక్క వేసుకున్నారని మండిపడ్డారు. వైఎస్సార్2సీపీ కార్యకర్తగా పల్నాడు ఎస్పీ వ్యవహరించారని.. సభను భగ్నం చేసేందుకు సాయ శక్తులా ఎస్పీ పని చేశారన్నారు. లక్షన్నర ప్రజలు వస్తారని ఇంటెలిజెన్స్ వాళ్ళు అనుకన్నారు.. కానీ పది లక్షల మందికి పైగా జనం వచ్చేసరికి సభను భగ్నం చేయాలని ఇంటెలిజెన్స్ డీజీ కంకణం కట్టుకున్నారన్నారు. ప్రధాని ప్రసంగించే సభలో మైక్ డిస్టర్బ్ కావడం ఏమిటి? ప్రధాని మాట్లాడుతుంటే కరెంట్ పోవడం ఎప్పుడైనా ఉందా? ప్రధాని ప్రసంగంలో 11 నిమిషాలు కరెంట్ పోవడం ఏమిటి? ఇది కేవలం పోలీసుల వైఫల్యం మాత్రమే అన్నారు. జగన్ ఓడిపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతానని డీజీలు, ఐజీలు, ఎస్పీలు అనుకుంటున్నారని.. అప్పటి వరకు ఎందుకు ఇప్పుడే పారిపోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సేవ చేయడంలో వీళ్ళందరూ పూనీతులు అవుతున్నారని.. అందుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజ్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ నలుగురు అధికారులు ఎన్నికల విధుల్లో గనుక పాల్గొంటే ఎన్నికల సజావుగా సాగవు కాబట్టి వారిని ఎన్నికలు అయ్యేంతవరకు ఎటువంటి కార్యకలాపాల్లో, విధుల్లో ఉండకుండా, వారిని దూరంగా పెట్టాలని ఎన్నికల అధికారిని కోరామన్నారు.


ప్రధాని విషయంలో ప్రోటోకాల్ పాటించని నాటి తెలంగాణ ముఖ్యమంత్రి పరిస్థతి ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలుసన్నారు. రానున్న రోజుల్లో జగన్ పరిస్థితి కూడా అలానే కాబోతుందన్నారు బీజేపీ నేత పాతూరి నాగభూషణం. ప్రజాగళం సభకు రావాల్సిన చాలామంది ప్రజలు రోడ్లపైనే ఉండిపోయారని.. పోలీసులు కావాలనే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించలేదన్నారు. కేవలం సభను భగ్నం చేయాలనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కుట్ర చేసిందని.. వేదిక మీద కూర్చునే నాయకులకు స్టేజ్ పాసులు అడిగితే ఎస్పీ తమ కాల్స్‌కు స్పందించలేదన్నారు. చివరికి ఎస్పీజీకి కంప్లెంట్ చేస్తే గానీ తమకు ఎస్పీ పాసులు ఇవ్వలేదన్నారు. ప్రధానిని సత్కరించేందుకు, స్వాగతించేందుకు బొకేలు, శాలువాలు కూడా స్టేజ్ మీదకు తీసుకెళ్లనివ్వకుండా పల్నాడు ఎస్పీ అడ్డుకున్నారన్నారు. ఇటువంటి అరాచకాలు చేశారు కాబట్టే ఈసీని కలిసి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. అధికార పార్టీకి పోలీసు అధికారులు కొమ్ము కాయడం సరికాదని.. రానున్న రోజుల్లో మోదీ, అమిత్ షా సభలు జరగనున్నాయన్నారు. మళ్లీ ఇటువంటి దుర్మార్గమైన చర్యలు జరగకుండా ఉండాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఈ సభలో పోలీసుల తీరుపై పీఎంవోకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.


ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి అధినేత ప్రధాని నరేంద్ర మోదీ, మన రాష్ట్రంలో పర్యటిస్తుంటే కావాల్సిన భ్రద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీసు యంత్రాంగం విఫలమయ్యిందని జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. ప్రధాని మోదీ హాజరైన సభలో 11 నిమిషాల పాటు విద్యుత్ నిలిపివేశారని.. ఇలాంటి పోలీసు వ్యవస్థను పెట్టుకొని ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టం అన్నారు. పోలీసు వ్యవస్థలో ఖచ్చితంగా మార్పులు చేయాలని ఎన్నికల అధికారిని తాము కోరామన్నారు. ఆదివారం జరిగిన సంఘటన భారత ప్రజాస్వామ్యానికి అవమానకరమని.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. సౌండ్ బాక్సులు వద్దకు జనం రాకుండా చూసే బాధ్యత పోలీసులదేనని.. ఎటువంటి భద్రత తీసుకోవాలో ఎన్ఎస్జీ చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకొని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొవాలిన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశామన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com