ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండల విద్యాధికారుల-2కు నెలకు రూ.వెయ్యి చొప్పన స్థిర రవాణా భత్యాన్ని ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఎంఈవో-1కు ఈ సదుపాయం ఉండగా.. వారికీ భత్యాన్ని ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం పాఠశాల విద్యను మరింత బలోపేతం చేయడానికి మండలాల్లో ఇద్దరు ఎంఈవోలు ఉండే విధంగా విద్యాశాఖ కార్యాచరణ చేసింది. గతేడాది ఎంఈవో-2ను నియమించడానికి మార్గదర్శకాలు వెలువరించింది.
స్కూలు అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతుల ద్వారా కాకుండా కేవలం మండల విద్యాధికారులు, గ్రేడ్-2 హెచ్‌ఎంల బదిలీల ద్వారా మాత్రమే భర్తీ చేస్తారు. ప్రభుత్వం మొదట ప్రకటించిన విధంగా ఎంఈవో-2 పోస్టులను కేవలం జడ్పీ యాజమాన్యంలోని వారికి మాత్రమే పరిమితం చేశారు. ప్రస్తుతం ఎంఈవో-1లో పనిచేస్తున్న జడ్పీ యాజమాన్యం వారు, జడ్పీ హైస్కూళ్లలో విల్లింగ్ తెలిపిన గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులతో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటారు.
ఎంఈవో-2లు పాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యసనకు వీలుగా పాఠశాలలను ముస్తాబుచేయడం, ఆ వివరాలు నమోదు చేస్తారు. బడియట పిల్లల గుర్తింపు, బడిలో చేర్పించే ప్రక్రియ పరిశీలన.. వృత్తి విద్యను ప్రోత్సహించడం, విద్యార్థుల ఆసక్తి గమనిస్తారు. బోధన ప్రక్రియలో చేర్చడం.. విద్యార్థుల ప్రగతినివేదికలు పరిశీలిస్తారు. విజ్ఞాన ప్రదర్శనల నిర్వహణ ఏర్పాట్ల పర్యవేక్షణ, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తారు. నాడు–నేడు పనుల పరిశీలన, డిజిటల్ బోధన పరికరాలు సమకూర్చడం, ప్రభుత్వం సరఫరా చేస్తున్న జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులందరికీ అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు.
పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం (జగనన్న గోరుముద్ద) మెనూ సక్రమంగా అమలయ్యేలా చూడడం.. విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగేందుకు అనువుగా పాఠశాల వాతావరణం తీర్చిదిద్దుతారు. ‘అమ్మఒడి’ పథకం అర్హులైన విద్యార్థులందరికీ అందేలా పర్యవేక్షణతో పాటుగా పాఠశాలలు, విద్యార్థులకు భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడం, బాలికలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతాపరమైన అంశాలపై అవగాహన సదస్సుల నిర్వహిస్తారు.
ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల జవాబు పత్రాలను 23 వేల మంది అధ్యాపకులు ఒక్కొక్కరు రోజు 30 పత్రాల చొప్పున మూల్యాంకనం చేస్తారని పేర్కొన్నారు. మరోవైపు పదో తరగతి మొదటి రోజు పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 96.35% మంది విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 6,54,553 మంది పరీక్ష ఫీజు చెల్లించగా, వీరిలో 6,30,633 మంది సోమవారం మొదటి భాష పరీక్ష రాశారు. సోమవారం విజయవాడలోని పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్, ఇతర అధికారులు పరిశీలించారు.