కర్నూలు జిల్లాలో ఐదేళ్ల బాలుడు ఆస్పత్రి గదిలో చిక్కుకుపోయాడు. మాటలు రాని, వినపడని బాలుడు అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో బందీగా మారాడు. తల్లిదండ్రులను, ఆసుపత్రి సిబ్బందిని ఆందోళనచెందగా.. ఆ తర్వాత బాలుడు సురక్షితంగా ఉండటంతో కథ సుఖాంతమయ్యింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన ఉస్సేనయ్య, మౌనికల కుమారుడు సుజిత్ (5)కు పుట్టుకతో మూగ, చెవుడు. ఈ క్రమంలో సర్జరీ కోసం 20 రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించారు.
ఆదివారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో బాలుడు వార్డు పక్కనే ఉన్న ఎనస్థీషియా డిపార్ట్‌మెంట్ హెడ్ గదిలోకి వెళ్లిపోయాడు. సిబ్బంది అదే సమయంలో ఆ గదిని శుభ్రం చేసి చిన్నారిని గమనించకుండా తాళం వేసుకుని వెళ్లిపోయారు. కుమారుడు కనపడకపోవడంతో సిబ్బందికి తల్లి సమాచారం ఇచ్చారు. వారు ఎంత ప్రయత్నించినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఆ వైద్యుడి గది తలుపులు తెరవగా సుజిత్ కనపడటంతో సిబ్బంది అవాక్కయ్యారు. తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు.
ఆ పిల్లాడు ఆ గది ఫ్రిజ్‌లో ఉన్న నీటిని తాగి ప్రాణాలు కాపాడుకున్నాడని సిబ్బంది తెలిపారు. బాలుడు ఒక రోజంతా ఆ గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. సోమవారం గది తలుపు తీయబట్టి సరిపోయింది.. ఒకవేళ అలాగే రెండు, మూడు రోజులు ఉంటే పరిస్థితి ఏంటని అందరూ భయపడ్డారు. అయితే బాలుడు సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.