రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భూటాన్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన మోడీ ఆ దేశ రాజధాని థింపులో ల్యాండ్ అయ్యారు.అక్కడ ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ ప్రధాని షెరింగ్ తోబ్గే స్వాగతం పలికారు. అనంతరం పారో నుండి థింఫు వరకు మొత్తం 45 కిలో మీటర్ల పొడవున నిలబడిన ఆ దేశస్తులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని వెళ్లే దారి గుండా ఓ మానవ గోడ కట్టినట్టు కనిపించింది. అక్కడ ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రధానిపై అభిమానాన్ని చాటుకున్నారు. తాజా పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. అదేవిధంగా రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలకు మోడీ హాజరుకానున్నారు.పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'డ్యూక్ గ్యాల్పో'ను మోదీకి అందజేయనున్నారు. ఈ అవార్డును మోడీకి 2021లోనే ప్రకటించారు. అప్పటి నుంచి ఆ దేశానికి వెళ్లే అవకాశం ప్రధానికి రాలేదు. ఇప్పుడు ఆ అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ చేతుల మీదుగా మోడీ స్వయంగా అందుకోనున్నారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసినందుకు, కొవిడ్ సమయంలో తొలి విడతలోనే 5 లక్షల టీకాలను అందజేయడం వంటి చర్యలు తీసుకొన్నందుకు గానూ మోడీకి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. కాగా, వాస్తవానికి మోడీ నిన్ననే భూటాన్ వెళ్లాల్సి ఉంది. అయితే, అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది. ఒకరోజు ఆలస్యంగా ఇవాళ ఆ దేశ పర్యటకు వెళ్లారు.