రైలెక్కాలంటే టికెట్ మాత్రమే ఉంటే సరిపోదండోయ్.. కూసింత అదృష్టం కూడా ఉండాలి మరి. అదేంటి ట్రైన్ ఎక్కడానికి, అదృష్టానికి అసలు సంబంధం ఏంటని అనుకుంటున్నారా. అక్కడే ఉంది మరి అసలు లాజిక్కు. అదృష్ణం ఎందుకు ఉండాలో శ్రీకాకుళం జిల్లా మందస రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులను అడిగితే చెప్తారు. మందస రైల్వే స్టేషన్‌లో గురువారం మధ్యాహ్నం తేనేటీగలు బీభత్సం సృష్టించాయి. టికెట్ తీసుకుని ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల మీద విరుచుకుపడ్డాయి. తేనేటీగల దాడితో ప్యాసింజర్లు అందరూ లగేజీ పట్టుకుని పరుగులు తీశారు. తేనేటీగల దాడి నుంచి తప్పించుకునేందుకు ప్లాట్ ఫామ్ మీద అటూ ఇటూ ఉరుకులూ పరుగులు తీశారు. గురువాం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భువనేశ్వర్, విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులు ఎదురుచూస్తున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు విరుచుకుపడ్డాయి.
తేనెటీగల గుంపు ఒక్కసారిగా వచ్చి ప్లాట్ ఫామ్ మీద ఎదురుచూస్తున్న ప్యాసింజర్ల మీద దాడి చేసింది. ఊహించని ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు బిత్తరపోయారు. దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. దీంతో భువనేశ్వర్, విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాల్సిన ప్రయాణికులు కొంతమంది రైలు మిస్ అయ్యారు. తేనెటీగల నుంచి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో పరుగులు తీయడంతో రైలు తప్పిపోయింది. తేనెటీగల దాడిలో 20 మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలిసింది. వీరిని స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మరోవైపు మందస రైల్వే స్టేషన్‌లోని చెట్లపై భారీ తేనెతుట్టెలు ఉన్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. వీటిని తొలగించాలని కోరుతున్నారు. లేకపోతే మరోసారి ఇలాంటి ఘటనలే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే గురువారం నాటి ఘటనలో తేనెతుట్టెను ఎవరైనా ఆకతాయిలు కదిలించారా.. లేక వాటంతట అవే దాడి చేశాయా అనే దానిపై క్లారిటీ లేదు.