అనంతపురం జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఏడు తులాల బంగారం కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్యచేసిందో కుటుంబం. అంతటితో ఊరుకోకుండా ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో ముక్కలుగా నరికి డ్యామ్‌లో విసిరేసింది. అయితే వృద్ధురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు తీగలాగితే అసలు దారుణం వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లకు చెందిన ఓబులమ్మ (84) ఒంటరిగా నివశిస్తోంది. ఓబుళమ్మ కుమార్తె హైదరాబాద్‌లో స్థిరపడగా.. ఓబులమ్మ ఇక్కడ ఒంటరిగా ఉంటోంది. చుట్టుపక్కల వారిని పలకరిస్తూ వృద్ధాప్య జీవితాన్ని అలా నడిపిస్తోంది. అయితే ఇటీవలే అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈ శుభకార్యం కోసం బంగారం అవసరం కాగా.. కృష్ణమూర్తి ఫ్యామిలీ ఓబులమ్మను అడిగింది.
దీంతో తనవద్ద ఉన్న ఏడు తులాల బంగారు నగలను కృష్ణమూర్తి కుటుంబానికి ఇచ్చింది ఓబుళమ్మ. ఒకటే ఊరు కావటం, అందులోనూ శుభకార్యానికి కావాలని అడగటంతో కాదనలేకపోయింది. అయితే వారి ఉద్దేశం వెనకున్న దారుణాన్ని ఓబుళమ్మ పసిగట్టలేకపోయింది. శుభకార్యం పూర్తై 15 రోజులు గడిచినా కూడా కృష్ణమూర్తి కుటుంబం తిరిగి ఇవ్వలేదు. ఒకటికి రెండుసార్లు అడిగిన ఓబుళమ్మ.. కృష్ణమూర్తి ఫ్యామిలీ పట్టించుకోకపోవటంతో స్థానికులకు విషయాన్ని చెప్పింది. తనవద్ద బంగారం తీసుకున్నారని, తిరిగి ఇవ్వలేదని ఊర్లో జనానికి చెప్పింది. దీంతో కృష్ణమూర్తి కుటుంబసభ్యులు ఆగ్రహించారు. శుక్రవారం ఓబుళమ్మతో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే గొడ్డలితో ఓబుళమ్మపై దాడి చేశారు. ఓబుళమ్మను గొడ్డలితో హతమార్చి.. ఆపై శరీరభాగాలను పెనకచర్ల డ్యామ్‌లో పడేశారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో వృద్ధురాలి బంధువులు కృష్ణమూర్తి కుటంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్‌ఐ బాషా ఘటనాస్థలాన్ని పరీశిలించి.. వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పెనకచర్ల డ్యామ్ నుంచి ఓబుళమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.