టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు ఈ భేటీ జరిగింది. రెండు పార్టీలూ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలు, ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించిన చోట పరిస్థితులు, అక్కడక్కడా ఉన్న అసంతృప్తులు వంటి అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. టీడీపీ ఇంకా 16 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో ఇంకా 5 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాలి. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరింత విస్తృత సమన్వయంతో పనిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, మూడు పార్టీల నాయకులూ కలిసి పాల్గొనాల్సిన సభలు వంటి అంశాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది.
తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక వ్యవహారం జనసేనలో హాట్ టాపిక్‌గా మారింది. ఆరణి శ్రీనివాసులును అభ్యర్థిగా కొనసాగించాలా లేదా అనే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మరోవైపు టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థులకు శనివారం విజయవాడలో వర్క్‌షాప్ నిర్వహించబోతున్నారు. దానికి ముందుగానే వీలైనంత మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఎంపీ అభ్యర్థులు, కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు మూడో జాబితాలో ఉండే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 లోక్‌సభ సీట్లలో పోటీచేయనున్న సంగతి తెలిసిందే.
టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కూడా ప్రధానంగా కసరత్తు చేస్తోంది. ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. హిందూపురం లోక్‌సభ స్థానానికి బీకే పార్థసారథి పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్ల తెలుస్తోంది. అనంతపురం లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పోటీ చేయించాలని టీడీపీ ఆలోచన చేస్తోంది. నంద్యాల సీటును బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరికి దాదాపు ఖాయమైనట్లు చెబుతున్నారు.. ఇప్పటికే ఆమె ప్రచారం కూడా ప్రారంభించారు. అమలాపురం ఎంపీ సీటు దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీశ్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. బాపట్ల లోక్‌సభ అభ్యర్థిపై క్లారిటీ రావాల్సి ఉంది. విజయనగరం లోక్‌సభ స్థానాన్ని సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇచ్చారు. దానిని వెనక్కి తీసుకుని రాజంపేట ఇవ్వాలని బీజేపీ కోరింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
టీడీపీ ఎంపీ అభ్యర్థులుగా.. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేటలో లావు శ్రీకృష్ణ దేవరాయల పేర్లు ఫైనల్ చేశారు. ఇప్పటికే వారు ప్రచారం కూడా మొదలు పెట్టారు. శ్రీకాకుళం నుంచి మరోసారి రామ్మోహన్ నాయుడికే అవకాశం దక్కనుంది. విశాఖ నుంచి బాలయ్య చిన్నల్లుడు భరత్ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. అనకాపల్లి సీటుపై ఇంకా క్లారిటీ రాలేదు.. ఈ సీటు పొత్తులో ఏ పార్టీకి కేటాయిస్తారన్నది చూడాలి. రాజమహేంద్రవరం బీజేపీకి, కాకినాడ జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. నరసాపురం కూడా బీజేపీకి కేటాయించినట్లు సమాచారం. విజయవాడ సీటు నుంచి కేశినేని చిన్ని పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది. మచిలీపట్నం సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయిస్తారని చెబుతున్నారు.
ఒంగోలు ఎంపీగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖాయం చేసింది టీడీపీ. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారు చేయడం లాంఛనమే. తిరుపతి సీటు కేటాయింపుపై క్లారిటీ రాలేదు.. చిత్తూరు అభ్యర్థి ఎంపికపైనా కసరత్తు జరుగుతోంది. కర్నూలు ఎంపీ సీటు అంశంపై టీడీపీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.. అలాగే కడప ఎంపీ అభ్యర్థి ఎవరనేది కూడా క్లారిటీ రాలేదు. అయితే ఫైనల్ చేసిన ఎంపీ అభ్యర్థుల్ని మాత్రం ప్రకటించాలని భావిస్తున్నారు.