ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్.. తాజాగా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ను జనసేన ఖరారు చేసింది. మార్చి 27న పిఠాపురం వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. మూడు రోజుల పాటు అక్కడ ప్రచారం నిర్వహించనున్నారు. వారాహి వాహనంతో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని జనసేన వెల్లడించింది. పిఠాపురంలో మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించిన తర్వాత.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపింది.
ఎన్నికల ప్రచారంపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ శుక్రవారం జనసేన నేతలతో సమావేశమయ్యారు. ప్రచార వ్యూహాలపై చర్చించారు. అనంతరం పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని షెడ్యూల్ ఖరారు చేశారు. శక్తిపీఠం కొలువైన క్షేత్రం, శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలుపెట్టడం శుభప్రదమని జనసేన నేతలు సంతోషం వ్యక్తం చేశారు. పిఠాపురంలోని పురూహూతిక దేవికి పూజలు నిర్వహించిన తర్వాత.. పవన్ వారాహి వాహనం నుంచి ఈ ప్రచారం ప్రారంభించనున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన పురూహతికదేవి ఆలయం.. దేశంలోని 18 శక్తిపీఠాలలో ఒకటిగా పేర్కొంటారు. దక్ష యజ్ఞం తరువాత, సతీదేవి యొక్క శరీర భాగం ఈ ప్రాంతంలో పడిపోయిందని చరిత్రకారులు చెప్పేమాట. దీని కారణంగా ఈ ప్రాంతాన్ని పూర్వం పురూహతిక పురం అని పిలిచేవారనీ.. కాలక్రమంలో అది కాస్తా పీటీకాపురంగా ఆ తర్వాత పిఠాపురంగా మారిందని పెద్దలు చెప్పేమాట.
మరోవైపు పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ మిగతా నియోజకవర్గాలలో పర్యటిస్తారు. మూడురోజుల పర్యటనలో పిఠాపురంలోని ముఖ్యనేతలతో పవన్ భేటీ కానున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పవన్.. పార్టీవర్గాలకు ఆదేశాలిచ్చారు. పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక నేతలకు సూచించారు. పోల్ మేనేజమెంట్ పైనా పలు సూచనలు చేశారు.