శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లిలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడితోటల్లో పనులకు వెళ్లిన రైతులపై దాడి చేసింది. ఈ క్రమంలో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో అనకాపల్లిలో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లికి చెందిన చీడిపల్లి లోకనాథం(47), ఆయన భార్య సావిత్రి, అప్పికొండ కూర్మారావు(49) శనివారం ఉదయం జీడితోటల్లో పనులు చేసుకుంటున్నారు. ఈ సమయంలో జీడి తుప్పల్లో ఉన్న ఎలుగుబంటి సావిత్రిపై దాడి చేసింది. పక్కనే ఉన్న భర్త లోకనాథం ఆమెను రక్షించేందుకు ప్రయత్నించగా ఆయనపైనా దాడి చేసింది. ఇద్దరూ గట్టిగా కేకలు వేయడంతో పక్కతోటలో ఉన్న కూర్మారావు అక్కడికి చేరుకున్నాడు. ఎలుగుబంటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించగా.. ఆయనపై కూడా దాడి చేసింది. చుట్టుపక్కల తోటల్లో ఉన్న రైతులంతా సంఘటన స్థలానికి చేరుకుని గట్టిగా కేకలు వేయడం.. కర్రలతో తరిమికొట్టడంతో ఎలుగుబంటి పక్క తోటల్లోకి పారిపోయింది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న ఆ ముగ్గురినీ స్థానికులు పరిశీలించగా.. లోకనాథం, కూర్మారావు మృతి చెందినట్టు గుర్తించారు. సావిత్రిని పలాస ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అటవీశాఖాధికారులు భాస్కరరెడ్డి, పోలయ్య తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. విచక్షణారహితంగా దాడి చేసి ఇద్దరి మృతికి కారణమైన ఎలుగుబంటిని గ్రామస్థులు ఆగ్రహంతో కర్రలతో కొట్టి హతమార్చారని తెలుస్తోంది.