చోరీ కేసులో సినీ నటి సౌమ్యశెట్టి అరెస్టు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. విశాఖ నగరంలోని రైల్వే న్యూకాలనీలో గల తన స్నేహితురాలు మౌనిక పుట్టింట్లో సౌమ్యశెట్టి 75 తులాలు బంగారం అపహరించిందనే అభియోగంపై ఫోర్త్ టౌన్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బెయిల్‌పై బయటకు వచ్చిన సౌమ్యశెట్టి తనను అన్యాయంగా చోరీ కేసులో ఇరికించారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతోపాటు పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆరోపిస్తున్నారు. తాను చోరీ చేసి, హడావుడిగా బయటకు వెళ్లిపోయినట్టు సీసీ కెమెరా ఫుటేజీల్లో కనిపించందని మౌనిక తండ్రి ప్రసాద్, పోలీసులు చెప్పడంలో వాస్తవం లేదంటోంది. తాను మౌనిక ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమెతోపాటు ఆమె తల్లిదండ్రులు తమతోపాటే కిందకు వచ్చి కారు ఎక్కించారని, ఈ విషయం సీసీ ఫుటేజీ పరిశీలిస్తే తెలుస్తుందని సౌమ్యశెట్టి చెబుతోంది. పైగా ఆ నగలను మౌనికే తనకే ఇచ్చిందని సౌమ్యశెట్టి ఆరోపిస్తోంది. తనను అన్యాయంగా ఇరికించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, న్యాయపోరాటం చేసి తన నిజాయితీని నిరూపించుకుంటానని పేర్కొంటోంది. అయితే ఇలాంటి వీడియోల కారణంగా తన కుమార్తె మౌనిక మానసికంగా క్షోభకు గురవుతోందని, తమ కుటుంబం పరువు ప్రతిష్ఠలను భంగం వాటిల్లుతుందంటూ మౌనిక తండ్రి ప్రసాద్ శనివారం ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం సివిల్ నేచర్ కింద రశీదు ఇచ్చి పంపించేసినట్టు తెలిసింది. చోరీ కేసులో సొత్తును స్వల్ప వ్యవధిలోనే రికవరీ చేశామని పోలీసులు గొప్పగా చెప్పుకున్నారు. అయితే క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న ఒక అధికారి సొత్తును రికవరీ చేసినందుకు తమకు ఎంతో కొంత ఇవ్వాలంటూ బాధిత కుటుంబం నుంచి డబ్బు గుంజారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కేసు తిరిగి తిరిగి ఎటు వెళుతుందోననే ఆందోళన ప్రస్తుతం పోలీసుల్లో వ్యక్తమవుతోంది.