విశాఖపట్నం పర్యటన మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని అమెరికా నేవీ అధికారులు తెలిపారు. భారత్ నౌకాదళంతో కలిసి టైగర్ ట్రయంఫ్-24 విన్యాసాల్లో పాల్గొనడానికి వచ్చిన వారు శనివారం విలేకరులతో మాట్లాడారు. వారి నౌక యుఎస్‌ఎస్ సోమర్‌సెట్ గురించి సర్ఫేస్ వార్‌ఫేర్ ఆఫీసర్ బ్రెంజిక్ వివరించారు. డజన్ల కొద్దీ మిలటరీ వాహనాలను తరలించే శక్తి ఆ నౌకకు ఉందన్నారు. ఇది ఉభయచర వాహనాలను చేరవేస్తుందని, వేయి మంది సెయలర్లకు ఏర్పాట్లు ఉన్నాయన్నారు. బోట్లకు రిపేర్లు చేసేందుకు వర్క్‌షాపు కూడా ఉందన్నారు. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ల్యాండింగ్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. ఇక్కడ భారత నౌకాదళంతో గడిపిన సమయం ఎంతో విలువైనదని, వారి నుంచి అనేకం తెలుసుకున్నామని సంతోషం వ్యక్తంచేశారు.