‘‘రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 160 సీట్లు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమివే. అంతకుమించి కూడా విజయ ఢంకా మోగించడం ఖాయం’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ తరఫున ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయనున్న నేతలకు శనివారం విజయవాడలోని ఎ.కన్వెన్షన్‌లో వర్క్‌షాప్ నిర్వహించారు. దీనికి టీడీపీ అభ్యర్థులు సహా జనసేన, బీజేపీల ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, శ్రీపాద సత్యనారాయణ, పాతూరి నాగభూషణం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి, అభివృద్ధి పథంలో నడిపించడానికే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ‘‘జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి నాలుగు వందలకు పైగా లోక్‌సభ స్థానాలు గెలిచి కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ మనం 160కి పైగా సీట్లు గెలవబోతున్నాం. 25 లోక్‌సభ స్థానాల్లో కడప సహా 24 సీట్లు మనవే. కడప లోక్‌సభ స్థానం కూడా మనమే గెలవబోతున్నాం. కడపలో ఏ మొహం పెట్టుకొని వైసీపీ ఓట్లు అడుగుతుంది? బాబాయి మాదిరిగా అందరినీ లేపేస్తామని ఓట్లు అడుగుతారా? రాష్ట్రంలో అవినీతి అరాచక విధ్వంసక పాలన రెండు నెలల్లో ముగిసిపోనుంది. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలవాలి. ఇదే మన లక్ష్యం. దీని కోసమే పోరాడాలి. నేను 160 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తా. పవన్ కల్యాణ్‌తో కూడా మాట్లాడా. ఆయన కూడా వీలైనంత విస్తృతంగా ప్రచారం చేస్తారు. వచ్చే 25 రోజులకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు ఒక టైం టేబుల్ ఇస్తున్నాం. దాని ప్రకారం వీలైనంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలి. అన్ని వర్గాల వారికి చేరువ కావాలి. వచ్చే రెండు నెలల్లో ఒక్క రోజు కూడా వృథా చేయొద్దు. ఘన విజయంతో తిరిగి రండి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.