సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ పార్టీలు విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే ఆరు జాబితాలు విడుదల చేసింది. అయితే ఆదివారం విడుదల చేసిన ఐదో జాబితాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరు కూడా ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్‌సభ సీటుకు బీజేపీ కంగనా రనౌత్ పేరును ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే బీజేపీ తరఫున రాజకీయాల్లోకి వస్తున్నట్లు కంగనా పేర్కొంది.
ఈ క్రమంలోనే 3 ఏళ్ల క్రితం కంగనా రనౌత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే పేదరికం, సమస్యలు, నేరాలు లేని హిమాచల్‌ప్రదేశ్ నుంచి తాను పోటీ చేయబోనని.. ఒకవేళ తాను గనక రాజకీయాల్లోకి వస్తే సమస్యలు ఉన్న రాష్ట్రం నుంచే పోటీ చేస్తానని ఆ ట్వీట్‌లో కంగన తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ జనాభా కేవలం 60 నుంచి 70 లక్షలు మాత్రమేనని.. పేదరికం, నేరాలు లేవని తెలిపింది. తాను పోటీ చేసే ప్రాంతంలో సమస్యలను పరిష్కరించి రాజకీయ రంగంలోనూ రాణిని అవుతానని పేర్కొంది. మార్చి 2021లో చేసిన ట్వీట్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు గ్వాలియర్ టికెట్ ఇచ్చారని చెప్పింది.
ఈ క్రమంలోనే ఆదివారం బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో హిమాచల్‌లోని మండి నుంచి కంగనకు పార్టీ టికెట్ దక్కడంపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఎలాంటి సమస్యలు లేని హిమాచల్ నుంచి పోటీ చేయనని చెప్పిన కంగన.. ఇప్పుడు ఎలా బరిలోకి దిగుతారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా తనకు బీజేపీ అధిష్ఠానం ఎంపీ టికెట్ ఇవ్వడంపై కంగన స్పందించింది. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని.. కాషాయ పార్టీ హైకమాండ్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ట్వీట్ చేసింది.
ఈ క్రమంలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు కంగనా రనౌత్ ప్రకటన చేసింది. ‘‘నా ప్రియమైన భారతదేశం, భారతీయ ప్రజల స్వంత పార్టీ భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నాకు బేషరతుగా మద్దతు ఇస్తోంది. ఈ రోజు బీజేపీ జాతీయ నాయకత్వం నన్ను నా స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. మండి స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై బీజేపీ హైకమాండ్ నిర్ణయాన్ని తాను ఆహ్వానిస్తున్నాని" అని కంగన ట్వీట్ చేసింది.