ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కస్టడీ నుంచి తొలి ఉత్తర్వులు వెలువరించారు. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ మంత్రి అతిషీ మార్లేనా స్పష్టం చేశారు. ఒకవేళ.. కేజ్రీవాల్‌ను జైలుకు పంపించినా.. అక్కడి నుంచే ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతారని.. ఇప్పటికే ఆప్ నేతలు, మంత్రులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచి పాలన సాగించడాన్ని ఈడీ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తమ కస్టడీలో ఉన్న
కేజ్రీవాల్‌కు తాము పేపర్ గానీ, కంప్యూటర్ గానీ ఇవ్వలేదని.. అలాంటి సమయంలో ఆయన ఆదేశాలు ఎలా ఇస్తారన్నది ఈడీ ప్రధాన వాదన. ఈ క్రమంలోనే మంత్రి అతిషీ మీడియా సమావేశంలో ఓ పేపర్‌ను చూపించడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ క్రమంలోనే కస్టడీ లో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారంటూ ఆప్ నేతలు చెప్పడాన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే సీఎం ఉత్తర్వులను మీడియాకు వివరించిన మంత్రి అతిషీని ప్రశ్నించడంతో పాటు కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కదలికలను పరిశీలించేందుకు సీసీటీవీ ఫుటేజీని కూడా వెలికి తీయనుంది. కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారంటూ ఢిల్లీ మంత్రి అతిషీ మార్లేనా ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ తాజాగా ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారని ఒక పేపర్‌ను కూడా చూపించారు.
అయితే ఈ విషయాన్ని ఈడీ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈడీ ప్రధాన కార్యాలయంలో కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌కు తాము కంప్యూటర్, కాగితాలు ఏవీ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయి అనేది తెలుసుకునేందుకు ఈడీ అన్నిరకాల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అతిషీ చూపించిన ఆ పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునేందుకు ఆమెను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సిద్ధం అవుతున్నారు. అంతే కాకుండా ఈడీ ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్ ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు అక్కడ ఉన్న సీసీటీవీ వీడియోలను కూడా చూసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి ఉత్తర్వులు జారీ చేయడంతో బీజేపీకి మరింత ప్రమాదకరంగా తయారయ్యారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి తాము హాజరు కానున్నట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు జరిగిన పోరాటంలో కూడా జైలుకు వెళ్లిన నాయకులు బలంగా తిరిగి వచ్చారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.