మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భస్మ హారతి జరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో కనీసం 14 మంది పూజారులకు గాయాలయ్యాయి. గర్భగుడిలో ప్రమాదం జరగడంతో లోపల ఉన్న పూజారులు తప్పించుకోవడం కష్టమైంది. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు జిల్లా కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు.
గాయపడినవారిలో ప్రధాన అర్చకుడు సంజయ్ గురు సహా పలువురు ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లోపలి నుంచి ఒక్కసారిగా వారంతా పరుగెత్తుకుని బయటకు వచ్చారు. బయట ఉన్నవారు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. హోలీ వేడుకలు చేసుకుంటున్న సమయంలో ప్రమాదం జరగడంతో పరుగులు తీశారు. ఇప్పటి వరకూ ప్రాణనష్టంపై ఎటువంటి సమాచారం లేదు.